చెక్ బౌన్స్ కేసుల కట్టడికి ఆర్ధికశాఖ సమాలోచనలు

చెక్ బౌన్స్ కేసుల కట్టడికి ఆర్ధికశాఖ సమాలోచనలు


ఏపీ పబ్లిక్ న్యూస్ : ఢిల్లీ 

దిల్లీ: చెక్‌ బౌన్స్ కేసులను సమర్థంగా ఎదుర్కోనే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాలోచనలు జరుపుతోంది. అందుకోసం ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.ఒకవేళ చెక్‌ జారీ చేసినవారి ఖాతాలో డబ్బులు లేకపోతే.. వారి ఇతర ఖాతాల నుంచి కూడా నగదును తీసుకునేలా నిబంధనల్ని మార్చాలని కొన్ని వర్గాల నుంచి సలహాలు అందాయి. అలాగే చెక్‌ బౌన్స్‌ అయినవారు కొత్త ఖాతాలు తెరవడానికి వీల్లేకుండా నిషేధం విధించాలని మరికొందరు సూచించారు. ఈ మేరకు వివిధ వర్గాలతో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.చెక్‌ బౌన్స్‌ను రుణ ఎగవేతగా పరిగణించాలని మరికొందరు నిపుణులు కేంద్రానికి సూచించారు. ఫలితంగా క్రెడిట్‌ బ్యూరోలు వారి క్రెడిట్‌ స్కోరును తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రతిపాదనలను గనక అమలు చేస్తే ఖాతాదారులు తాము జారీ చేసే చెక్‌లు బౌన్స్‌ కాకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నారు. ఫలితంగా వ్యవహారం చట్టపరమైన సమస్యగా మారకుండా.. కోర్టుల్లో పేరుకుపోతున్న ఈ తరహా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వ్యాపార సంబంధిత, ఇతర లావాదేవీలు సజావుగా సాగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయడానికి పెద్ద ఎత్తున సమాచారాన్ని అనుసంధానించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. అలాగే ఆటోడెబిట్‌ వంటి వాటికి నిర్ధిష్ట నిర్వహణ ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుందన్నారు.చెక్‌ బౌన్సులకు సంబంధించి కోర్టుల్లో దాదాపు 35 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వీటి సత్వర, సమర్థ పరిష్కారానికి కావాల్సిన సలహాలు, సూచనలు ప్రతిపాదించాల్సిందిగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపిన ఈ కమిటీ పలు సూచనలు చేసింది. 'నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881'కి తగు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించింది. అలాగే ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం చెక్‌ బౌన్స్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తేవాలని గతకొంత కాలంగా కోరుతున్నాయి.