పవన్, చంద్రబాబు కలయికతో అధికార పార్టీకి కలవరం...?

పవన్, చంద్రబాబు కలయికతో అధికార పార్టీకి కలవరం...?

- ఏపీలో సరికొత్త రాజకీయం

- త్వరలో పొత్తులు ఖరారయ్యానా...!

- అధికార పార్టీలో ఆందోళన


ఏపీ పబ్లిక్ న్యూస్ : విజయవాడ

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు విజయవాడలో కలవడం రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి తెరలేపింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఏకమవ్వాలని ఈ నాయకులు పైకి చెబుతున్నప్పటికీ త్వరలోనే ఈ రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు కుదరబోతుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. అధికార వైయస్సార్ పార్టీ అరికట్టాలంటే అంతా ఏకం అవ్వాలని వీరు ఇరువురు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే ఈ నాయకుల లోపాయికారిపొత్తు ఈ సందర్భంలో బయటపడిందని వారు పొత్తు కుదుర్చుకునేందుకు విశాఖ సంఘటనను బూచిగా చూపిస్తున్నారని కొందరు రాష్ట్ర మంత్రులు,వైయస్సార్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలకు కీలకంగా మారనున్నాయి.రాష్ట్ర విభజన అనంతరం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి 2014 ఎన్నికలలో అధికారం చేపట్టేలా సహకరించింది. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ కమ్యూనిస్టులు,బిఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేయగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే జనసేన పార్టీ కైవసం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం 23 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చినది. ఈ ఇరు పార్టీలు ఎన్నికలలో విడివిడిగా పోటీ చేయటంవలన ఓటర్లలో చీలిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లు తలంచడం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ టిడిపిని అన్ని రకాలగా ఇబ్బంది పెట్టడం తదితర కారణాలతో టీడీపీ ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి టిడిపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని సర్వత్ర ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో అధికారిక పొత్తుతో ముందుకు సాగుతుంది. 2014 ఎన్నికలలో సైతం బిజెపి,టిడిపి పార్టీల ఈ గెలుపు కోసం జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసింది. రానున్న కాలంలో తిరిగి బిజెపి టిడిపి జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలో నిలుస్తాయా లేదా అనే విషయం తేలాల్సి ఉన్నది. టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగితే తమ సీటు పరిస్థితి ఏమిటని రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల ఆశావాహులలో ఆందోళన నిరుత్సాహం నెలకొన్నది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ రెండు పార్టీల కలయికతో తమకు ముప్పు తప్పేలా లేదని అంతర్లీనంగా మదన పడుతున్నట్లు తెలిసింది. పైకి మాత్రం ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్ పార్టీకి వచ్చిన ముప్పు లేదని మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి వస్తే గడిచిన ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ముదునూరి ప్రసాద్ రాజు ప్రస్తుతం చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు. టిడిపి నుంచి అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పోటీ చేసి ఓటమి చవిచూశారు.అనంతర కాలంలో టిడిపి ఇంచార్జ్ బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం మాధవ నాయుడును తొలగించి పొత్తురి రామాంజనేయ రాజుకు అప్పగించింది. ప్రస్తుతం నర్సాపురం టిడిపి ఎమ్మెల్యే టికెట్ ను నియోజకవర్గ నాయకుడు, ఎన్నారై,కొవ్వలి ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్న కొవ్వలి యత్తిరాజ రామ్మోహన్ నాయుడు, టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తదితరులు, జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్ తో పాటు ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు చాగంటి మురళీకృష్ణ (చిన్న) లు ఆశిస్తున్నట్లు వారి వారి అనుచరులు అంటున్నారు. పైన పేర్కొన్న వారంతా పోటీకి తగ్గట్టుగా వారి వారి ఏర్పాటులలో ఉండగా ఈ రెండు పార్టీల కలయికతో ఏ పార్టీ సీటు దక్కించుకుంటుందోనని వారి అందరిలోనూ అంతర్లీనంగా ఆందోళన నెలకొన్నట్లు తెలియ వచ్చింది. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగితే అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీలలోని నాయకులు కార్యకర్తలు లోలోపల ఆనంద పడుతూ ఉండగా సీటు ఆశిస్తున్న వారు మాత్రం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్నారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని త్వరలోనే తన అనుచరులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సుబ్బారాయుడుకు గతంలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. పొత్తుతో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పైన పేర్కొన్న నాయకుల భవిష్యత్ భవిష్యత్తే చెబుతుంది అని సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.