పవన్ కళ్యాణ్ ఒక అపరిచితుడు - చంద్రబాబు ముసుగు వీరుడు - ఎంపీ భరత్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ ఒక అపరిచితుడు - చంద్రబాబు ముసుగు వీరుడు - ఎంపీ భరత్ కామెంట్స్ 


- చంద్రబాబు, పవన్ నాటకాలు వైసీపీకి ఎప్పుడో తెలుసు

- కేంద్రంలో బీజేపీతో డ్రామాల బాబుల జిమ్మిక్కులు పనిచేయలేదు

- లాభం లేదని ముసుగువీరులు ముసుగు తీశారు..

- పవన్ ఒక అపరిచితుడు..

- మీడియా సమావేశంలో ఎంపీ భరత్


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

రాజమండ్రి, అక్టోబరు 19: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ ఆడే నాటకాలు రక్తికట్టడం లేదు..అందుకే ముసుగు వీరులు ముసుగు తీశారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. బుధవారం స్థానిక మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు. వేర్వేరు పార్టీల ముసుగులో వీరు అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్ర ప్రజలను తమ నటనా చాతుర్యంతో మభ్యపరిచి మళ్ళీ అధికారాన్ని లాక్కోవడానికి విశ్వప్రయత్నాలు చేశారని, ఫలితం లేకపోవడంతో ఇక లాభం లేదని ఈ ప్రేమ పావురాలు ముసుగు తీశారన్నారు. జనసేన, టీడీపీ దెందుకు దెందేనన్న విషయం వైసీపీకి ఎప్పుడో తెలుసన్నారు. కాకపోతే పవన్ వీరాభిమానులే గుర్తించలేకపోయారని అన్నారు. ఆయన నటనకు ముగ్ధులై, అభిమానం పెంచుకున్న వారందరూ తమ అభిమాన నటుడు పవన్ సీఎం కావాలని కలలు కంటుంటే..ఈయనేమో ప్యాకేజీ లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉండటానికి చంద్రబాబే కారణమన్నారు. అలాగే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జీ రామ్మోహనరావు, టీజీ వెంకటేష్ లను బీజేపీ లో చేరడానికి కూడా చంద్రబాబు కారణమన్నారు. వీరంతా కోవర్టులుగా పనిచేసినా..బీజేపీ అగ్రనేతల వద్ద వీరి డ్రామాలేమీ పనిచేయలేదన్నారు. బీజేపీ తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వలేదని బాధపడుతున్న పవన్..బీజేపీ- టీడీపీ కలపడానికి రోడ్డు మ్యాప్ ఇవ్వలేదనా ఆ బాధ అని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ నాటకాలు..

చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు ఆరాటమంతా అని ఎంపీ భరత్ విమర్శించారు. 2014 లో జనసేన పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు ను గెలిపించారని, ఎవరైనా పార్టీ పెడితే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయడానికే కదా అని ప్రశ్నించారు. కేవలం డబ్బులు కోసమే దత్తపుత్రుడు మాటకాలన్నీ అని ఆరోపించారు. ఒకవైపు తమ నేత జగనన్న చెపుతున్నట్టు దుష్ట చతుష్టయం (టీవీ-5, వీరాంధ్ర జ్యోతి, ప్యాకేజీ స్టార్, ఆనాడు) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తమకేమీ నష్టం ఉండదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, జగన్ పాలనపై సంపూర్ణ విశ్వాసం, ఆదరణ చూపిస్తున్నారని చెప్పారు.

అపరిచితుడులా పవన్..

ఆయన వ్యవహారం, మాటల తీరు చూస్తుంటే అపరిచితుడు మాదిరిగానే ఉందంటూ పవన్ పై ఎంపీ భరత్ సెటైర్లు వేశారు. విశాఖ హోటల్ లో తమకు సంస్కారం ఉందని, అందుకే నోరు జారడం లేదని, ఏమీ మాట్లాడలేకపోతున్నానని చెప్పిన ఆ ప్యాకేజీ స్టార్... విజయవాడ హోటల్లో అపరిచితుడుగా మారి ఏదేదో ఆవేశంగా మాట్లాడటాన్ని ప్రజలంతా నవ్వుకుంటున్నారని అన్నారు. చెప్పులు చూపించి గట్టిగా మాట్లాడితే భయపడిపోవడానికి ఎవరూ అమాయకులేమీ కాదన్నారు. బీజేపీతో ఆడిన డ్రామా సక్సెస్ కాకపోవడంతో ప్రస్టేషన్ తో పాపం దత్తపుత్రుడు ఉన్నారని ఎంపీ భరత్ అన్నారు.