రాజమండ్రిలో అల్లకల్లోలానికి కారకులు టీడీపీ, జనసేననే

రాజమండ్రిలో అల్లకల్లోలానికి కారకులు టీడీపీ, జనసేననే - ఎంపీ భరత్ 


- శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాళ్ళు, వాటర్ బాటిల్స్ తో మాపై దాడి చేయించారు

- మా పార్టీ కార్యకర్తల బుర్రలు బద్దలు కొట్టారు

- తిరిగి మాపై ఆరోపణలు

- అనుకూల పత్రికలలో పిచ్చి రాతలు

- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్


ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

రాజమండ్రి, అక్టోబరు 19: అమరావతి రైతుల ముసుగులో టీడీపీ, జనసేన ముష్కరులు తమపై ఒక పథకం ప్రకారమే దాడులకు తెగబడ్డారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలు సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి రాజమండ్రిలో అల్లకల్లోలం సృష్టించారని ఆరోపించారు. మంగళవారం నగరంలోని అజాద్ చౌక్ వద్ద అమరావతి రైతుల పాదయాత్రకు తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే టీడీపీ, జనసేన నేతల ఆధ్వర్యంలో కొంతమంది రాళ్ళు, మురుగు నీటితో ఉన్న వాటర్ బాటిల్స్, చెప్పులు, పండ్లతోనూ తమపై దాడి చేశారన్నారు. మా పార్టీ కార్యకర్తలిద్దరికి తలలు పగిలాయన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఒకరిపై కూడా వాటర్ బాటిల్ విసరారన్నారు. అది వేగంగా వచ్చి చెంపపై గట్టిగా తగిలిందన్నారు. నిన్న పాదయాత్ర పేరుతో రాజమండ్రిలో అల్లకల్లోలం సృష్టించింది ఒకరైతే..వారి అనుకూల పత్రికలలో ఇష్టం వచ్చినట్లు రాశారని ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జగనన్న చెప్పే దుష్ట చతుష్టయం..తమ రాతలు, చేతల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని, వారి ఆటలు సాగవన్నారు. నిజంగా తాము దాడి చేయాలన్నా, జగనన్న కళ్ళెర్ర చేసినా పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు కదలదన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే మామ, భర్త బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారని, వారి వల్లే రాజమండ్రిలో గుండాల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. పోలీసులు అటువంటి వారిని అరెస్టు చేసి, నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఎంపీ భరత్ కోరారు.