30న రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు

30న రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు

అన్ని జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు రాక

టీ.కె.విశ్వేశ్వర రెడ్డి వెల్లడి

రాజమహేంద్రవరం, ఏపీ పబ్లిక్ న్యూస్ : డిసెంబర్ 30,31 వ తేదీలలో రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టి.కె.విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపత్ నగర్ లోని తమ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. 66వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు 14, 17, 19 ఏళ్ల వయసు గల మూడు విభాగాలలో జరుగుతాయని చెప్పారు. ఈ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతాయని, ఫెడరేషన్ గౌరవ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వ్యవహరిస్తున్నారని, అధ్యక్షులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.అబ్రహం వ్యవహరిస్తున్నారని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఎవరైనా వచ్చి చూడవచ్చని తెలిపారు. ప్రస్తుతం రైఫిల్ షూటింగ్ పట్ల పిల్లలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి మూడు బహుమతులను వరుసగా రూ 10 వేలు, రూ 5 వేలు, రూ 3 వేలు తమ స్కూల్ తరపున అందజేస్తున్నట్లు విశ్వేశ్వర రెడ్డి ప్రకటించారు. తమ స్కూల్ నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో స్కేటింగ్, హార్స్ రైడింగ్, కరాటే, రైఫిల్ షూటింగ్ వంటి జాతీయ క్రీడలలో తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాణాల రీత్యా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ నెంబర్ వన్ స్కూల్ గా నిలిచిందని చెప్పారు. ఈ క్రీడలను బయటి వారు ఎవరైనా నేర్చుకునేందుకు ప్రతి ఆదివారం సంపత్ నగర్ లోని తమ స్కూల్ లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.నాగ కుమార్ మాట్లాడుతూ ఈ సారి రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ కు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ కు అనువైన "రేంజ్" ఉండడం వల్ల ఈ అవకాశం దక్కిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ టి.వి.డి. చంద్ర శేఖర్, ఆ స్కూల్ డైరెక్టర్ టి.స్వరూప్ రెడ్డి, జిల్లా పి.ఇ.టి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వి.డి. ప్రసాదరావు, ఇబ్రహీం, వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.