అన్యోన్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారు - ఎంపీ భరత్

 అన్యోన్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారు..

- అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారు..

- ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారు..

- ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారు..

- తండ్రి పాత్ర పోషించవలసిన కేంద్ర ప్రభుత్వం ఏపీపై చిన్న చూపు చూస్తోంది

- ఈ ఆవేదన దేశ ప్రజలందరిలోనూ ఉంది

- లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్


ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

రాజమండ్రి, డిసెంబరు 13: 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా రెండుగా చీల్చేశారు..ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి..అదీ మాట తప్పారు..ఇంత అన్యాయం, ఇంత దారుణం ఏ రాష్ట్రానికీ బహుశా జరిగి ఉండకపోవచ్చునని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని కేంద్రప్రభుత్వాన్ని నిగ్గతీసి అడిగారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న అన్యాయంపై తన వాణిని వినిపించారు. తన ఆవేదన‌ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే కాదని, యావత్ దేశ ప్రజలందరిదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పట్లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేసినప్పుడు దేశ ప్రజలందరూ విస్మయాన్ని, ఆవేదనను వ్యక్యం చేశారన్నారు. ఇప్పుడు తమ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం.. పసిపాప..పౌష్టికాహారాన్ని అందించవలసిన బాధ్యత తండ్రి వంటి కేంద్ర ప్రభుత్వానిదేనని నొక్కి చెప్పారు. లోక్‌సభలో మాది మైనారిటీ. కేవలం 25మంది సభ్యులం మాత్రమే ఉన్నాం. అయినా తమ స్వరం తక్కువ కాదని, న్యాయం జరిగే వరకూ ఇలానే మా డిమాండ్లను అడుగుతామని ఎంపీ భరత్ తీవ్రస్వరంతో చెప్పారు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరు ఆర్థికంగా బలవంతుడుగాను, మరొకడు బలహీనుడుగా ఉంటే ఆదుకోవలసింది తండ్రి లాంటి కేంద్రమే కదా అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం లోక్‌సభలో వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ కు అయిదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ లోక్‌సభలో గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కావాలని ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెట్టామని చెప్పారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక గ్రాంట్స్ మా ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేయాలని పట్టుబట్టారు. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి కోరిన విషయాన్ని సభకు గుర్తు చేశారు. నిధులు టీడీపీ హయాంలో దుర్వినియోగం చేశారని, ఆ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆ ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలే తప్పిస్తే ఆ అపవాదు మా ప్రభుత్వంపై రుద్దడం న్యాయం కాదన్నారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరానికి వెచ్చించిన‌ రూ.2,800 కోట్లకు పైగా నిధులు కేంద్రం విడుదల చేయాలని, ఈనాటి వరకూ ఎందుకు విడుదల చేయలేదో అర్థం కావడం లేదన్నారు. ‌ప్రాజెక్టు నిర్మాణానికి ముందు రాష్ట్రం ఖర్చుపెట్టాక ఆ తరువాత మంజూరు చేస్తానని కేంద్రం అనడం బాధాకరమన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టు కు వెచ్చించిన నిధులు వెంటనే మంజూరు చేయాలని ఎంపీ మార్గాని భరత్ రామ్ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.