ఇన్నాళ్ళూ అధికారంలో ఉండి ఏమి ఉద్దరించారు? రాజమండ్రి టీడీపీ నేతలపై ఒంటి కాలిపై లేచిన ఎంపీ భరత్

ఇన్నాళ్ళూ అధికారంలో ఉండి ఏమి ఉద్దరించారు? రాజమండ్రి టీడీపీ నేతలపై ఒంటి కాలిపై లేచిన ఎంపీ భరత్

-: గోదావరి ప్రక్షాళనకు ఏమి చర్యలు తీసుకున్నారు..

-: అధికారాలు వెలగబెట్టడం తప్పిస్తే.. ప్రజల ఇబ్బందులు పట్టించుకున్నారా?

ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమహేంద్రవరం:-

రాజమండ్రి నగరంలో గోదావరి నదిలో నీరు కలుషితమవుతోందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిసి కూడా వారేమి చేశారంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నగరంలోని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను విలేకరులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎంపీ భరత్ స్పందిస్తూ రాజమండ్రి నగరానికి గోదావరి నది ఒక వరమని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ అన్నారు. మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాత్ర కీలకమని, అటువంటిది గోదావరి పరిరక్షణకు టీడీపీ నేతలు ఏమి చేశారని ప్రశ్నించారు. ఒకరు మేయర్‌గా, మరొకరు ఎమ్మెల్సీ గా, ఇప్పుడు ఎమ్మెల్యే గా పదవులు అలంకరించారే తప్పిస్తే ప్రజల సంక్షేమానికి ఏమి చేశారో చెప్పమనండని ప్రశ్నించారు. కలుషిత నీటిని ప్యూర్ ఫైర్ చేసే సామర్థ్యం పూర్తిగా లేదని తెలిసి కూడా‌ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ప్రశ్నించారు. ‌ప్రజల ఇబ్బందులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి గత నెల రోజులకు పైగా నిరాహారదీక్ష చేస్తున్నారని, ఆయన కృషిని అభినందించాలన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఆయన తపనకు నగర ప్రజలందరూ అభినందించాలన్నారు. ఆ విధంగా మీరెందుకు స్పందించలేకపోయారని ప్రశ్నించారు. ఎంపీగా ఈ మూడున్నరేళ్ళలో చేసినన్ని పనులు మీ రాజకీయ జీవితం మొత్తంలో చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ కింద రూ.410 కోట్లు డీపీఆర్ లు పంపించగా, కేవలం తనను చూసి కేంద్ర జనశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజమండ్రికి రూ.‌88 కోట్లు శాంక్షన్ చేశారన్నారు. ‌దీంట్లో కేంద్రం వాటా రూ. 56కోట్లని, మిగిలినది రాష్ట్రం శాంక్షన్ చేస్తుందని చెప్పారు. పేపర్ మిల్లు యాజమాన్యంతో కూడా మాట్లాడతామన్నారు. నగరంలోని వ్యర్థపదార్థాలతో పాటు, పేపర్ మిల్ నుండి విడుదల చేసే కాలుష్య నీటిని నేరుగా గోదావరి నదిలోకి కాకుండా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మించి దాని ద్వారా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ వివరించారు.

గోరంట్లకు తెలియదా?

పొలిటికల్ ఫీల్డ్ లో పార్టీ ఇయర్స్ అనుభవమున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెలియదా గోదావరి నదిలో నీటి కాలుష్యం గురించని ఎంపీ భరత్ ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో లక్షలాదిగా భక్తులు వస్తారని, నదిలో స్నానాలు చేస్తారని తెలిసి కూడా‌ కలుషిత నీటి ప్రక్షాళనకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎంఎల్టీడీ కెపాసిటీ 30శాతం అయితే, కలుషిత నీరు 60 శాతం అని, అంటే సగం కలుషిత నీరు ప్యూర్ ఫైర్ చేయకుండానే గోదావరిలో కలిసిపోతోందనే విషయం గోరంట్లకు తెలియదా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో 100 ఎంఎల్టీడీ చేయాలన్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా‌ కేంద్రం నుండి రూ.86 కోట్లు తీసుకొచ్చాను..మీరెందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. మీ వయసెంత, నా వయసెంత?..అంటూ ఎమ్మెల్యే గోరంట్లను ఉద్దేశించి ఎంపీ భరత్ ప్రశ్నించారు. చేయాలనే ఆలోచన, అకుంఠిత దీక్ష ఉంటే ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం ఏదైనా చేయవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.