పత్తి నాణ్యతను బట్టే విదేశీ గిరాకీ - ఎంపీ భరత్

 పత్తి నాణ్యతను బట్టే విదేశీ గిరాకీ

- గత సంవత్సరం కంటే అధికోత్పత్తి

- గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణాలలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట

- దేశ వ్యాప్తంగా 341.91 లక్షల పత్తి దిగుబడి

- గత రెండేళ్ళలో చూసుకుంటే తక్కువ, గత సంవత్సరంతో పోల్చుకుంటే 29 లక్షల బేళ్ళు ఎక్కువ

- లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర జౌళి శాఖ మంత్రి దర్శన్ జరదోష్


ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్

ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

రాజమహేంద్రవరం, డిసెంబరు 14: విదేశీ మార్కెట్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో పత్తి పంటను రైతాంగం పండిస్తోందని, అయితే సరైన గిట్టుబాటు ధర రావడం లేదనే అసంతృప్తి పత్తి రైతుల్లో కనిపిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి దర్శన్ జరదోష్ పేర్కొన్నారు. లోక్‌సభలో వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ దేశంలో పత్తి పంట సాగుకు రైతాంగం ఆసక్తి కనబర్చడం లేదని, రైతులను ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర జౌళి శాఖ మంత్రి దర్శన్ జరదోష్ ఎంపీ భరత్ కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మన దేశంలో ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలలో 65 శాతం పత్తి ఉత్పత్తి అవుతోందని మంత్రి పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో చూసుకుంటే అత్యల్పంగా తమిళనాడు రాష్ట్రం ఉందన్నారు. ఈ సంవత్సరం గరిష్ఠంగా గుజరాత్ రాష్ట్రంలో 91.83 లక్షల బేళ్ళ ఉత్పత్తి కాగా, ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణా ఉన్నాయని వివరించారు. 2020-21 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 352.48 లక్షల బేళ్ళు, ఆ మరుసటి సంవత్సరం 312.03 లక్షల బేళ్ళు, ప్రస్తుత సంవత్సరం 341.91 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయినట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి వివరించారు. ఈ సంవత్సరం మహారాష్ట్రలో 80.25 లక్షల బేళ్ళు, గుజరాత్ లో 91.83 లక్షలు, తెలంగాణా లో 53.25 లక్షల బేళ్ళు ఉత్పత్తి అయినట్టు మంత్రి తెలిపారు. ఇక మిగిలిన రాష్ట్రాల వారీగా చూసుకుంటే రాజస్థాన్ లో ఈ సంవత్సరం 27.12 లక్షల బేళ్ళు, కర్ణాటక 21.04, హర్యానా 17.21, ఆంధ్రప్రదేశ్ 17.85, మధ్యప్రదేశ్ 15.19, పంజాబ్ 9.22, ఒడిషా 6.82, తమిళనాడు 1.87 లక్షల బేళ్ళు పత్తి ఉత్పత్తి అయినట్టు కేంద్ర మంత్రి దరశన్ జరదోష్ ఎంపీ భరత్ కు వివరించారు. మొత్తంగా చూసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో పత్తి అధికోత్పత్తి సాధించగా, తెలంగాణాలో గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే తక్కువే అన్నారు. తమిళనాడు మినహాయిస్తే రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాలలో గత సంవత్సరం కంటే కాస్త ఎక్కువ ఉత్పత్తినే ఈ సంవత్సరం పత్తి రైతులు సాధించారని, మరింత ప్రోత్సాహవంతంగా రానున్న కాలంలో పండిస్తారనే ఆశాభావాన్ని కేంద్ర జౌళి శాఖ మంత్రి దర్శన్ జరదోష్ వ్యక్తం చేశారు. ప్రస్తుత పత్తి సీజన్ (2022-23)లో ఎగుమతి 40 లక్షల బేళ్ళు ఉంటుందని ఎంపీ భరత్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి చెప్పారు.