తోటి వారిని ఆదుకోవడంలోనే నిజమైన తృప్తి - ఎంపీ భరత్

తోటి వారిని ఆదుకోవడంలోనే నిజమైన తృప్తి

- అదే ఏసు జననం యొక్క పరమోద్దేశ్యం

- రాజవోలు క్రిస్మస్ వేడుకలో ఎంపీ భరత్



ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి:-

మానవాళి జీవిత లక్ష్యాన్ని తెలియజేసేందుకే పరలోకం నుండి ప్రభువైన ఏసు ఈ లోకానికి ఏ తెంచాడని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. అటువంటి పవిత్ర క్రిస్మస్ తొలి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి రూరల్ రాజవోలు రమాదేవి గార్డెన్స్ లో రాజమండ్రి డివిజన్ ఎంప్లాయిస్, ఏపీ ప్రేయర్ టీం క్రిస్మస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి క్రీస్తు ఆరాధ్యులకు క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెల వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని, అలాగే అందరిలోనూ ఏదో తెలియని ఆనందం కనిపిస్తుందన్నారు. అందుకే పవిత్ర డిసెంబరు మాసం నాకు చాలా ఇష్టమని చెప్పారు. ప్రజల కోసం, తనని విశ్వసించిన వారి కోసం ప్రభువైన ఏసు తన జీవితాన్ని దారపోశాడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవించడంలోనే నిజమైన తృప్తి కనిపిస్తుందన్నారు.‌ ప్రతి మనిషి తనలో ఉన్న స్వార్థాన్ని వీడి తోటి వారికి చేతనైనంత సహాయం, లేదా ఉపకారం చేయాలని అప్పుడే జీవిత పరమార్ధం నెరవేరుతుందన్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు టెర్మినల్ బిల్డింగ్, ఏరో బ్రిడ్జెస్, ఎయిర్ బస్ శాంక్షన్ చేయించగలిగానని, దీని కోసం చాలా కృషి చేయవలసి వచ్చిందని ఎంపీ భరత్ చెప్పారు. ఇందుకోసం రూ.384 కోట్లు శాంక్షన్ అయ్యాయని, ఈ శుభ సమయంలో ఇంత చక్కటి విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ భరత్ అన్నారు. ‌నేను ఎంపీ అయిన ఈ మూడున్నరేళ్ళలో అనుకున్న దానిలో కేవలం 25 శాతం మాత్రమే సాధించానని అనుకుంటున్నానని ఇంకా ఎంతో చేయవలసింది ఉందన్నారు. ఆ ప్రభువు దయ, కరుణ, మీ అందరి అభిమానం ఉండాలని ఎంపీ భరత్ కోరారు. ‌తనకు చదువు నేర్పిన సోషల్ మాష్టారు మాణిక్యాలరావు ను చూసి ఎంపీ భరత్ ఆనందాన్ని పొందారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించమని నిర్వాహకులను కోరారు. గురువు మాణిక్యాలరావు వేదికపైకి రాగానే ఆయనతో కలిసి క్యాండిల్ తో జ్యోతి వెలిగించి క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలికారు. ఏసు పుట్టి లోకానికి వెలుగు తీసుకొచ్చారనే సూచికతో పాటు పాపాల నుండి రక్షించాడనే సూచకంగా జ్యోతిని వెలిగిస్తున్నట్టు ఈ సందర్భంగా నిర్వాహకులు, సభలో వక్తలు ప్రకటించారు. అనంతరం ఎంపీ భరత్ రామ్ ను సత్కరించారు.