రేపు జరగబోయే ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య - ఎంపీ భరత్

రేపు జరగబోయే ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య  

తీర్పు చెప్పాల్సింది ఓటరు మహాశయులే 

- ఎంపీ భరత్

ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమహేంద్రవరం:-

రానున్న ఎన్నికలలో ప్రజలిచ్చే తీర్పుపైనే రాష్ట్ర భవితవ్యం ఆధారపడి ఉందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం ఆయన ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుష్ట చతుష్టయం, పెత్తందారుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఓటర్లపైన ఉందన్నారు. నీతికి అవినీతికి మధ్య, మంచికీ దుర్మార్గానికీ మధ్య జరిగే ఎన్నికలుగా ఎంపీ భరత్ అభివర్ణించారు. పేదల ప్రతినిధులు పెత్తందారుల మధ్య జరిగే ఈ ఎన్నికలలో ఎవరి పాలనలో ప్రజలకు న్యాయం జరిగిందో బేరీజు వేసుకుని సరైన తీర్పు నివ్వాలన్నారు. గడచిన‌ మూడున్నరేళ్ళలో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం దేనికీ వెరవకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన‌ అందించిందన్నారు. నిజం చెప్పాలంటే సంక్షేమ పాలనను ఒక యజ్ఞంగా జగనన్న ప్రజలకు అందించారన్నారు. టీడీపీ ప్రభుత్వం దోచుకో దాచుకో అన్న రీతిలో తమ‌ స్వార్థం కోసం రాష్ట్రాభివృద్ధిని భ్రష్టుపట్టించారని ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిన్న‌ జరిగిన సమావేశంలో సీఎం జగన్ తమకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ మూడున్నరేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు ఏమేమి చేశామో చెప్పి వారి ఆశీస్సులు తీసుకోమన్నారన్నారు. అందులో భాగంగానే గడప గడపకూ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందని జగనన్న పాలనపైనా, సంక్షేమ పథకాలపైనా ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న సంక్షేమ పాలనే వైసీపీకి, సామాన్య ప్రజలకు శ్రీరామరక్ష కాగలదని ఎంపీ భరత్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.