ప్రజల ప్రాణాలతో చెలగాటం అడవద్దు

ప్రజల ప్రాణాలతో చెలగాటం అడవద్దు

మాకు న్యాయం చెయ్యాలని, విద్యార్థినుల బైఠాయింపు

పేపర్ మిల్లు వద్ద ఉద్రిక్తత

పోలీసుల మోహరింపు 

విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న దీక్ష భగ్నానికి కుట్ర 

ఉద్యమకారులకు పోలీసుల బెదిరింపులు 

బర్రే కొండబాబు, కొంచాడ ఈశ్వర్ అరెస్టు


రాజమహేంద్రవరం, ఏపీ పబ్లిక్ న్యూస్  : గోదావరి కాలుష్యాన్ని నిర్మూలించాలంటూ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీ.కే.విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న దీక్ష ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వేచ్ఛమైన గోదావరి నీళ్ళు కావాలంటూ పుష్కరాల రేవులో గత 41 రోజులుగా చేస్తున్న దీక్షను సోమవారం స్థానిక పేపర్ మిల్లు గేటు ఎదుటకు మార్పు చేసి మౌన నిరాహార దీక్ష గా కొనసాగించారు. ఇందులో భాగంగా పలు కళాశాలల విద్యార్థినులు తమకు తాముగా పేపర్ మిల్లు వద్దకు చేరుకుని కొంత సేపు రాస్తారోకో నిర్వహించారు. పేపరు మిల్లు నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల గోదావరి కలుషితమవుతోందని, ఈ సమస్యపై గత 42 రోజులుగా ప్రజల తీరపున టి.కె.విశ్వేశ్వరె రెడ్డి దీక్ష చేస్తూంటే సమస్యపై సానుకూలంగా స్పందించకపోవడం విచారకరమని నినాదాలు చేశారు. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థినుల బైఠాయింపు పై విరుచుకుపడ్డారు. పేపర్ మిల్లు కాలుష్యం నుంచి గోదావరిని పరిరక్షించాలన్న నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.ఈ సందర్భంగా సి.ఐ మధు బాబు జోక్యం చేసుకుని మాట్లాడుతూ మీరంతా ఇక్కడ నుంచి తక్షణం వెళ్లి పోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే మంచి నీటి సమస్యపై పేపర్ మిల్లు యాజమాన్యం స్పందించే వరకూ తాము కదలబోమని వారు బదులు పలికారు. మళ్ళీ సి.ఐ జోక్యం చేసుకుని మాట్లాడుతూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి ధర్నాలు నిర్వహించరాదని, తమకు హైకోర్టు నుంచి ఇంజెంక్షన్ ఆర్డర్ వచ్చిందని కనుక మీరు ధర్నా నిర్వహించడానికి వీలులేదని, వెళ్లి పోవాలని హెచ్చరించారు. ఇదే సందర్భంలో ధర్నాకు నాయకత్వం వహించిన ఆందోళన కారులు బర్రే కొండబాబు, కొంచాడ ఈశ్వర్ ను పోలీసులు అరెస్టు చేసి, త్రీ టౌన్ కు తరలించారు.ఈ క్రమంలో విద్యార్థినులు వారి అరెస్టు ను నిరసిస్తూ పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తూ మాకు న్యాయం కావాలి అంటూ పెద్ద యెత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు 2 గంటల పాటు ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. రాస్తారోకో వల్ల పేపర్ మిల్లు లోనికి వెళ్లే కలప లారీలు, ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ప్రయాణికులు,వాహన చోదకులు స్తంభించారు. ఇది ఇలా ఉండగా పోలీసులు తమ మీదికి దూసుకొచ్చి దాడి చేసి, గెంటి వేశారని విద్యార్థినులు ఈ సందర్భంగా దీక్ష శిబిరం లో ఉన్న విశ్వేశ్వరరెడ్డి కి ఫిర్యాదు చేశారు. పోలీసులు తమను గెంటి వేసి బ్లౌజ్ చించేశారని చేతులపై కూడా గాయాలయ్యాయని విద్యార్థినులు ఆరోపించారు. ఇదే సందర్భంలో అటు వైపు వెళుతున్న న్యాయవాది శర్మ సీఐ మధు వద్దకు వెళ్లి, హైకోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ చూపించగలరా అని అడగ్గా వాటిని ఆయన చూపించారు. ఆ ఉత్తర్వులో కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అని ఉంది తప్పా స్టూడెంట్స్ ధర్నా చేయొద్దని ఎక్కడా చెప్పలేదని న్యాయవాది దీక్ష శిబిరం వద్ద స్పష్టం చేశారు. ఉద్రిక్తత తలెత్తి నిరసన నినాదాలతో పేపర్ మిల్లు ప్రాంతం అట్టుడుకుతున్న సందర్భంలో సీఐ మళ్ళీ దీక్ష శిబిరం వద్దకు వచ్చి, పిల్లలు ధర్నా విరమించుకోవాలని కోరగా, దానిపై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని తానేమి చేయలేనని అన్నారు. ఇదే సందర్భంలో మరో దీక్షా దారుడు సుబ్బారాజు మాట్లాడుతూ పోలీసులు ఆడపిల్లల్ని బెదిరించి, తల్లిదండ్రుల పేర్లు అడగడం మంచి విధానం కాదని ఆక్షేపించారు. పేపరు మిల్లును మూసి వేయాలన్నది తమ అభిమతం కాదని, ఏడు లక్షల మందికి మంచి నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్యమ లక్ష్యమని స్పష్టం చేశారు. దాదాపు రెండు గంటల పాటు నెలకొన్న ఉద్రిక్తత తర్వాత నెమ్మదిగా సద్దుమణిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రి కళాశాల ప్రిన్సిపాల్ సత్య సౌందర్య మాట్లాడుతూ ఉద్యమంలో ఉన్న ఆడపిల్లలపై పోలీసుల బల ప్రదర్శన చేయడం, బెదిరింపు ధోరణికు పాల్పడ్డం అన్యాయమని తెలిపారు.టీ.కే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎన్ని విధాలుగా ఉద్యమాన్ని అణిచి వేసినా దీక్ష ఆపేది లేదన్నారు.