దేశంలోని అన్ని రాష్ట్రాలూ సీఎం జగన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి - ఎంపీ భరత్

దేశంలోని అన్ని రాష్ట్రాలూ సీఎం జగన్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

- అవ్వాతాతలను అందుకోవడం అందరి బాధ్యత

- దేశ చరిత్రలో ఇంత భారీగా పెన్షన్లు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదు

- లక్షలాదిగా తరలివచ్చి సీఎంకు సంఘీభావం తెలపండి

- ఆర్ట్స్ కళాశాలలో సీఎం ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ భరత్



ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి, జనవరి 2: భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీగా పెన్షన్లు అవ్వాతాతలకు అందివ్వడం లేదని, ఒక్క మన రాష్ట్రంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తోందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ‌సోమవారం‌ ఆయన స్థానిక ఆర్ట్స్ కళాశాలలో సీఎం సభా స్థలిని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పిల్లలు లేని అనాధ అవ్వాతాతలను ఆదుకోవాల్సిన‌ బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవత్వంతో సీఎం జగన్ ఈ పెన్షన్లను అందిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేవారని, దానివల్ల అప్పట్లో నెలకు రూ.400 కోట్లు మాత్రమే భారం పడేదన్నారు. కానీ జగన్ నేతృత్వంలో 65 లక్షల మంది వృద్ధులకు ఏకంగా రూ.2,500 ల నుండి రూ.2,750లు పెన్షన్లు ఇవ్వడం వల్ల రూ.1700 కోట్లు రాష్ట్రానికి భారం పడుతోందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ పేద అవ్వాతాతలకు ఈ సామాజిక పెన్షన్లు అందజేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. ఇది సామాన్య విషయం కాదన్నారు. ‌సీఎం జగన్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని ఎంపీ భరత్ సూచించారు. ఇంత పెద్ద సామాజిక చైతన్య మహోద్యమం నిర్వహిస్తున్న సీఎం జగన్ రాజమండ్రి వస్తున్న సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చి‌ ఆయనకు సంఘీభావం తెలియజేయవలసిందిగా ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఆర్డీవో ఏ ఛైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.