సీఎం సభ విజయవంతం - ఎంపీ భరత్

 సీఎం సభ విజయవంతం - ఎంపీ భరత్ 

- ప్రజల అభిమానానికి నిదర్శనం

- పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి ఇదో తార్కాణం

- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్

ఏపీ పబ్లిక్ న్యూస్ రాజమండ్రి, జనవరి 4: రాజమండ్రిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం కావడంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరి కృషి మరువలేనిదని, వారందరికీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి నగరంలో ఇంత పెదగద ఎత్తున బహిరంగ సభ నిర్వహించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సభ విజయవంతానికి ప్రజలకు జగన్ పై ఉన్న‌ అభిమానమే కారణమని, అందుకే సుమారు లక్షకు పైగా ప్రజలు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చారన్నారు. రాజమండ్రి నగరానికి వచ్చేసరికి 50 వార్డులకు చెందిన పార్టీ ఇన్చార్జులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వల్లనే విజయవంతం‌ అయిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తితో సమిష్టిగా కలిసి పనిచేస్తామని, పార్టీకి మరింత గౌరవం తీసుకువచ్చేలా పనిచేస్తామని ఎంపీ భరత్ తెలిపారు. అయితే టీడీపీకి అనుకూల యల్లో మీడియా లేని దుష్ప్రచారం చేస్తోందన్నారు. జనాన్ని తరలించి, బయటకు రాకుండా నిర్బంధించినట్టు ప్రసారం చేయడాన్ని ఆయన ఖండించారు. దేశం మొత్తంపై అవ్వాతాతలకు ఇంత పెద్ద సంఖ్యలో, ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తున్న ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ కే దక్కిందని అన్నారు. అందుకే పెన్షన్ల పెంపు వారోత్సవాలలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని సీఎంకు నీరాజనాలు పలికారని చెప్పారు. గత టీడీపీ చంద్రబాబు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వడమే పెద్ద గగనమయ్యేదన్నారు. అప్పుడు జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపైనా, లంచాలపైనా లబ్ధిదారుల ఎంపిక జరిగేదని, ఇప్పుడు అర్హత ప్రాతిపదికగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ నేతల జోక్యం ఎక్కడా ఉండదని, వలంటీర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటోందన్నారు. ఏ ఒక్కరికీ పైసా ఇవ్వనవసరం లేదన్నారు. టీడీపీ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందజేస్తే, జగన్ నాయకత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 64.06 లక్షల మందికి అందజేస్తోందన్నారు. టీడీపీ హయాంలో నెలకు రూ.400 కోట్లు పెన్షన్లకు కేటాయిస్తే, జగన్ సర్కారు నెలకు రూ.17,565 కోట్లు అవ్వాతాతల పెన్షన్లకు వెచ్చిస్తోందన్నారు. అందుకే పెన్షన్ల పెంపు వారోత్సవాలను ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షం శోకాలు పెడుతోందని, పెన్షన్లు తీసేస్తారని దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ భరత్ అన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, మజ్జి అప్పారావు, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు.