నిరుపేదల ఇళ్ల భవిష్యత్తు ఏమిటి?

నిరుపేదల ఇళ్ల భవిష్యత్తు ఏమిటి?

జగన్ కాలనీలో అవగాహన లేని కొంతమంది తాపీ మేస్త్రులు, కాంట్రాక్టర్లు

నాణ్యతలేని నిర్మాణాలు 

నిర్మాణ నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు

పర్యవేక్షించని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు



ఏపీ పబ్లిక్ న్యూస్,  నిడదవోలు : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలను, ఇంటి నిర్మాణానికి ₹1,80,000 అందజేస్తున్నారు.

నిడదవోలు పట్టణంలో 3000 కుటుంబాలకు ఇంటి పట్టాలని అందజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి వందల సంఖ్యలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. సొంతంగా ఇంటి నిర్మించుకునే లబ్ధిదారులు కాంట్రాక్టర్లకు, తాపీ మేస్త్రులకు, తమ ఇంటిని దృఢంగా నిర్మించే బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందో అవగాహన లేని లబ్ధిదారులు ఎంతోమంది ఉన్నారు. వారు కేవలం కాంట్రాక్టర్ లేదా తాపీ మేస్త్రీల మీద నమ్మకంతో ఇంటి నిర్మాణ బాధ్యతలను ఇస్తున్నారు.

ఇంటి నిర్మాణ పని మీద సరైన అవగాహన లేని ఎంతోమంది లబ్ధిదారులను మభ్యపెట్టి ఇంటి నిర్మాణ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. అవగాహన లేని కొంతమంది కాంట్రాక్టర్లు, ఎలా చెప్తే అలాగే తాపీ మేస్త్రీలు వారు వేసేదే సిమెంటు, కలిపేది ఇసుక, పోసేది స్లాబ్ గా వ్యవహరిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పాటించవలసిన నియమాలు ఏవి పాటించకుండా, కేవలం డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలా అన్న పందాతోనే ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అవగాహన లేని కొంతమందికి ఇంటి నిర్మాణాలను అప్పగించిన లబ్ధిదారులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అవగాహన లేనివారు కొంతమంది నిర్మిస్తున్న నిర్మాణాలు గమనిస్తే స్లాబ్ లపై బిటలు, గోడలపై బిటలు కనపడుతాయి. పిల్లర్స్ కూడా బుట్టలు లేకుండా కేవలం ఊసలు గుచ్చి వేయడం విశేషం.

ఇప్పుడు ప్లాస్టింగ్ చేసిన తర్వాత లోపాలు కనబడకపోయినా తర్వాత ఈ ఇళ్ల పరిస్థితి ఏమిటి? ఇంటి నిర్మాణాలను పరిశీలించవలసిన సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు?

జగన్ ప్రభుత్వం ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని మంచి ఉద్దేశంతో 30 లక్షల మందికి ఇంటి పట్టాలని అందచేస్తే, అవగాహన లేని నిరుపేద లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ప్రతి ఇంటి నిర్మాణాన్ని అన్ని దశలలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలని, దీనిపై అధికారులు స్పందించాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.