కొవ్వూరులో మెగా జాబ్ మేళా

కొవ్వూరులో మెగా జాబ్ మేళా

35 ప్రముఖ కంపెనీలలో 2,100 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఏర్పాట్ల పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

 


ఏపీ పబ్లిక్ న్యూస్ : కొవ్వూరులో మంగళవారం జూలై 25న నిర్వహించే జిల్లా స్థాయి మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం హోంమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వాతావరణం కారణంగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా 35 ప్రముఖ దిగ్గజ కంపెనీలలో దాదాపు 2,100 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.  

 ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం మెగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొవ్వూరులో నిర్వహించే జిల్లా స్థాయి మెగా జాబ్ మేళాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు మంగళవారం ఉదయం 9:00 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వివిధ ప్రముఖ కంపెనీలను ఒప్పించి మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఐటీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మేళాలో పాల్గొంటున్నాయన్నారు. దాదాపు 2,100 మందికి పైగా ఈ జాబ్ మేళా ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరై సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలను పొందాలని హోంమంత్రి ఆకాంక్షించారు. ఉదయం 8 గంటలకే నిరుద్యోగులు అక్కడకు చేరుకుని తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఉదయం నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపికైన వారికి సాయంత్రమే ఆయా కంపెనీలు నియామకపు పత్రాలు అందజేస్తాయని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో పదవ తరగతి నుండి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర అర్హత కలిగిన వారంతా ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని అన్నారు. అలాగే ఫ్రెషర్స్, అనుభవం ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. ఉద్యోగార్థులు ఇక్కడ కేవలం ఒకే కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు కావాలని లేదని వారికున్న అర్హతలను బట్టి, ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు అయినా హాజరు కావొచ్చని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.