లోక కల్యాణ నిమిత్తం లక్ష బిల్వ పత్ర పూజ - పాల్గొన్న ఎంపి భరత్

 లోక కల్యాణ నిమిత్తం లక్ష బిల్వ పత్ర పూజ

- మార్కండేయేశ్వర స్వామి‌ ఆలయంలో ఎంపీ భరత్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు






ఏపీ పబ్లిక్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, నవంబర్ 11

రాజమండ్రి, నవంబరు 11: లోక కళ్యాణం నిమిత్తం పార్వతీ పరమేశ్వరులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించినట్టు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. నగరంలోని గోదావరి గట్టున గల అతి ప్రాచీనమైన మహిమాన్వితమైన శ్రీ మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువ ఝాము 4 గంటల నుంచి ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, కుమార్తెలు జయాని, శివాన్షి రామ్, ఎంపీ తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, సోదరుడు విజయ కృష్ణ ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం దీపావళి ముందు రోజు నరక చతుర్దశి రోజున ఎంపీ భరత్ కుటుంబ సభ్యులతో సహా మార్కండేయేశ్వర స్వామికి అత్యంత నియమ నిష్టలతో పూజలు, అభిషేకాలు చేయడం ఆనవాయితీగా‌ వస్తోంది. 

శ్రీ మార్కండేయేశ్వర స్వామి‌ దేవస్థాన ఛైర్మన్ యిన్నమూరి ప్రదీప్ (దీపు) ప్రత్యేక పర్యవేక్షణలో ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు ఎంపీ భరత్ దంపతులు నిర్వహించారు. ‌తొలుత గోదావరి మాతకు కుంకుమార్చన, నూతన వస్త్ర సమర్పణ చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ పవిత్ర గోదావరి జలాలను స్వయంగా ఎంపీ భరత్ ఒక కలశంతో ఆలయానికి తీసుకువచ్చి మార్కండేయేశ్వర స్వామికి అభిషేకం చేశారు. పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన లక్ష బిల్వపత్రాలతో పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ‌అలాగే పార్వతీ దేవికి కుంకుమార్చన ఎంపీ భరత్, మోనా దంపతులు గావించారు. ఆలయ ప్రాంగణంలో గల గోకులంలో గోవులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ భరత్ దంపతులు, ఎంపీ తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన దంపతులు పండిత సత్కారం చేశారు.

లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ..

లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఏటా శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామికి అత్యంత నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వపత్ర పూజ, కుంకుమార్చన, స్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఎంపీ భరత్ తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్టు తెలిపారు. నరకాసురుడిని లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వధించడంతో ప్రజలంతా ఆనందంగా దీపావళి జరుపుకోవడం ఒక ఆనవాయితీ అని, అటువంటి పర్వదినం రోజున రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఆనందంతో ఉంటారో అదే మాదిరిగా నిత్యం ఉండాలని తాను ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ఆరంభం అవుతోందని, భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. గోదావరి ఘాట్లను నిన్న కమిషనర్ తో కలిసి పరిశీలించినట్టు చెప్పారు. మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు, అలాగే వృద్ధులు స్నానమాచరించేందుకు షవర్స్ ఏర్పాటు చేసినట్టు ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ యిన్నమూరి ప్రదీప్, ఆలయ పాలకమండలి సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.