త్వరలో రాజకీయాల్లోకి వస్తా! క్రికెటర్ అంబటి రాయుడు

 త్వరలో రాజకీయాల్లోకి వస్తా! క్రికెటర్ అంబటి రాయుడు 

- ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి సంచలన ప్రకటన



ఏపీ పబ్లిక్ న్యూస్, నవంబర్ 03, రాజమహేంద్రవరం :

రాజమండ్రి, నవంబరు 3: ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలిస్తున్నానని, త్వరలో తప్పక రాజకీయాల్లోకి అడుగు పెడతానని ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి ఆయన రాజమండ్రి నగరంలోని కంబాల చెరువు పార్కు, పుష్కర్ ప్లాజా తదితర ప్రాంతాలను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో అంబటి మాట్లాడారు. మీరెప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా అంబటి సమాధానమిచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను సందర్శిస్తున్నానని, అక్కడ అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. రాజమండ్రి నగరాన్ని ఎంపీ భరత్ రామ్ చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారని, రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక విధాలుగా కృషి చేయడం తనకెంతగానో ఆనందం కల్గిస్తోందన్నారు. ఎంపీ భరత్ ఒక్క రాజమండ్రికే కాదు..రాష్ట్రంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.‌ అంకితభావంతో పనిచేయడం వల్లనే రాజమండ్రి ఇంత అద్భుతమైన నగరంగా అలరారుతోందని, ఈ ఘనత అంతా ఎంపీ భరత్ కే దక్కుతుందని అన్నారు. ఇండియా టీమ్ చేతిలో శ్రీలంక ఓటమిపై స్పందన ఏమిటని ప్రశ్నించగా..భారత్ టీమ్ చాలా బాగా ఆడుతోందని, అదే ఒరవడి కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని క్రికెటర్ అంబటి రాయుడు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువత క్రీడారంగంపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులు మరెంతోమంది రావడానికి అవకాశం ఉంటుందన్నారు. మన దేశంలో యువత సాధన చేస్తే ఏ రంగంలో నైనా రాణిస్తారని, అందుకు తగిన ప్రోత్సాహం అవసరమని అన్నారు. మన రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించే క్రీడాకారులు చాలామంది ఉన్నారని, వారందరినీ ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు మన సొంతం అవుతాయని అంబటి రాయుడు చెప్పారు. రాజమండ్రి నగరంలా ప్రతీ నగరం అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి వెళుతుందనే ఆశాభావాన్ని అంబటి రాయుడు వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ ఇండియన్ టీమ్ కు సెలక్ట్ కావడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలన్నారు. మన ఆంధ్రాకు చెందిన యువకుడు అంబటి రాయుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో సూపర్ స్టార్ గా రాణించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఇటువంటి యువకులు క్రీడా రంగంలో రాణిస్తూ రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తే చాలా సంతోషమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రానున్న 2034లో ఒలింపిక్స్ కు మన భారత దేశం అతిథ్యం ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని, అప్పటికి మన రాష్ట్రం నుంచి అద్భుత క్రీడాకారులు తయారు కావాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచించారన్నారు. ఇప్పట్నుంచీ మంచి క్రీడాకారులను తయారు చేసేందుకు అన్ని రకాలుగా పోటీలు, ప్రత్యేక సాధనకు అవసరమైన స్టేడియంల నిర్మాణం జరుగుతోందన్నారు. రాజమండ్రిలో రెండు స్టేడియంలు, అదే విధంగా నన్నయ వర్సిటీలో ఒక ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నట్టు ఎంపీ భరత్ వివరించారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ కే దినేష్ కుమార్, నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.