శ్రీ సుబ్రహ్మణ్యం మైదానానికి కొత్త శోభ - అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ భరత్

 శ్రీ సుబ్రహ్మణ్యం మైదానానికి కొత్త శోభ

- అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ భరత్


ఏపీ పబ్లిక్ న్యూస్,  రాజమండ్రి, నవంబరు 2: రాజమండ్రి నగరంలో అత్యంత చారిత్రాత్మకమైన శ్రీ సుబ్రహ్మణ్యం మైదానం, శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రాలను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. గురువారం శ్రీ సుబ్రహ్మణ్యం మైదానంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీ భరత్ కమిషనర్ కే దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలో శ్రీ సుబ్రహ్మణ్యం మైదానికి ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందని, అందుకు సంబంధించిన ఆనవాళ్లను ఏ మాత్రం ముట్టుకోకుండా మిగిలిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ గత వైభవానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తు తరాలకు కూడా గత వైభవాన్ని స్మరించుకునే విధంగా, పది కాలాల పాటు చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రధానంగా సుబ్రహ్మణ్యం మైదానంలో వేదికను మరింత విస్తరింపజేస్తున్నామని, ప్రేక్షకులు ఆరు బయట కూర్చున్నప్పుడు అందుకు తగ్గ ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ‌ఈ పనులన్నీ ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.6 కోట్లతో చేపడుతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆనం కళా కేంద్రంలో కూడా ఇవే నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. ‌ప్రస్తుతం శ్రీ సుబ్రహ్మణ్యం మైదానంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అక్కడక్కడ కొన్ని మార్పులు, సూచనలు కమిషనర్ దినేష్ కుమార్ కు ఎంపీ భరత్ తెలిపారు.